నా పేరు శ్వేత. మధ్యతరగతి కుటుంబమునకు చెందిన ఒక సాధారణ వ్యక్తిని. మాది హైదరాబాద్. నాకు నా కుటుంబం మరియు నా స్నేహితుల పట్ల ప్రేమ చాలా ఎక్కువ. వారే నా బలం, బలహీనత కూడా. రోజూవారి కార్యకలాపాలతో పాటు ఖాళీ సమయంలో పుస్తకాలు చదవటం, వంట చయడం, ఫోటోగ్రఫీ, కవితలు వ్రాయడం, ఇంకా నా ఆలోచనలు, భావాలను కాగితం మీద వ్రాయడం నా అలవాట్లు. అప్పుడప్పుడు సమయం చిక్కినప్పుడల్లా నాలో నేనుగా నాకు నేనుగా గడపడం నాకు ఇష్టం. అప్పుడే నాలోకి నేను తొంగిచూసుకోగలను. ఒకరితో పోల్చుకోను. సంతోషం ఎక్కడో లేదు..మనలో దాగి ఉంటుందని నా నమ్మకం. ఉన్నది ఒకటే జీవితం. నచ్చింది చేయాలి. మన కలలను నెరవేర్చుకోవడానికి కృషి చేయాలి. నలుగురికి సాయపడాలి, సంతోషం పంచాలి. మనం కూడా సంతోషంగా ఉండాలి. కాని మన సంతోషం ఇతరులకు బాధను కలిగించకూడదని నా అభిప్రాయం.

ఈ బ్లాగు నా అభిరుచులకు, ఆలోచనలకు, భావాలకు దర్పణం వంటిది. ఖాళీ సమయాల్లో నేను వ్రాసుకునే కవితలు, గీసిన చిత్రాలు, నా కెమరాలో బంధించిన ఛాయాచిత్రాలు – వాటితో అల్లుకున్న కథలు – ముచ్చట్లు, వివిధ అంశాలపై నా ఆలోచనలు – భావాలు, నా జీవిత పయనంలోని కొన్ని మరిచిపోని విషయాలు, మరియు అవి..ఇవీ..అన్నీ ఒకే దగ్గర.. ఈ బ్లాగులో దర్శనమిస్తాయి. వీటితోపాటు అప్పుడప్పుడు నేను వ్రాసుకున్న నా సొంత సూక్తులు(Quotes) కూడా ఇందులో ఉంటాయి. మాది హైదరాబాద్ కాబట్టి నాకు హిందీ కూడా వచ్చు. అందుచేత నా కవితల విభాగంలో కొన్ని హిందీ కవితలు కూడా దర్శనమిస్తాయి. చివరిగా.. ఈ బ్లాగు పేరు మరియు నా కలం పేరు రెండూ ఒకటే. బ్లాగు పేరు క్రింద ఉన్న ట్యాగ్ లైన్ లో ఉన్న చంద్రకళ పదం… అది మా అమ్మ పేరు. ఈ రోజు ఇలా ఉన్నానంటే మా అమ్మ వల్లే. అమ్మ నా జీవితంలో లేకపొతే నేను లేను మరియు ఈ నా బ్లాగు కూడా లేదు.