(#23) మా ఇంటి పెరట్లో అందమైన, పచ్చనైన తుమ్మి మొక్కలు..ఆహా!! వీటిలో ఉన్నాయి భలే ఔషదీయ గుణాలు

గత మూడు సంవత్సరాల నుండి మా ఇంటి పెరట్లో ఈ తుమ్మి మొక్కలు పెరుగుతున్నాయి. వినాయకుడికి ప్రీతి పాత్రమైనది ఈ మొక్క. ప్రతీ సంవత్సరం వినాయక చవితికి మూడు, నాలుగు నెలల ముందే మొలకలొచ్చేస్తాయి. వినాయక చవితి వరకు గుబురుగా పెరిగి, చిన్ని చిన్ని తెల్లని పువ్వులతో కళకళలాడుతాయి. ఈ తెల్లటి పువ్వుల వల్లే తుమ్మి మొక్క మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొదట్లో మాకు వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించేది ఈ మొక్క మా ఇంటి పెరట్లో పెరగడమేమిటని. అది కూడా మేము వాటికోసం ఎలాంటి విత్తనాలు వేయకుండానే. తరువాత తరువాత మాకు అలవాటయిపోయింది. మా ఇంటికి కొత్త వారు ఎవరొచ్చినా, ఈ మొక్కలని చూసి

ఆశ్చర్యానికి లోనవడం ఖాయం. ఎందుకంటే ఈ మొక్క సాధరణంగా ఎవరూ ఇళ్ళలో పెంచుకోరు కాబట్టి. తుమ్మి కూర భలే ఉందని, వినాయక చవితి కి తుమ్మి కూరకు కొరతే లేదని కొంతమంది… చవితి రోజు మాకూ కొంత కావాలని మరి కొంతమంది అంటూ ఉంటారు. వారి మాటలు విని, నివ్వి ఊరుకుంటాము. వీరిలా అంటూ ఉంటే లోలోపలో మాకూ గర్వంగానే ఉంటుంది.మా కాలనీలో ఎవరింట్లో కనిపించని మొక్క మా ఇంటి పెరడులో ఉన్నందుకు. మీరు చూస్తున్న ఫొటో నేను తీసిందే.. వినాయక చవితికి ముందు వారమే, ఈ సంవత్సరం గుర్తుగా ఉంటుందని ముందుగానే క్లిక్ చేసి పెట్టుకున్నాను. అదే మీరు చూస్తున్నది. చవితి రోజు వినాయకుడిని పూపత్రితో పూజిస్తాము. అందులో “తుమ్మి” ఒకటి. పండుగ రోజు ఈ మొక్కలని మేము పూజకోసం వాడతాము.. అంతేకాకుండా ఆచారం ప్రకారం ఆ రోజు ఈ మొక్క ఆకులని పప్పు లేదా చింతకాయలతో కలిపి వండుతాము. భలే రుచిగా ఉంటుంది.

“తుమ్మి” మొక్కకు మరో పేరు “ద్రోణ”. వృక్షశాస్త్రం లో దీనికి గల శాస్త్రీయ నామం ” Leucas aspera “.
వివిధ భాషాలలో తుమ్మి ని వివిధ రకాలుగా పిలుస్తారు. ఉదాహరణకు..
హిందీ : చోటాకల్కుస
కన్నడ : తుంబెగిడ
తమిళం : తుంబై
బెంగాలీ : చోటాకల్కుస
మలయాళం : తుంబ
ఈ మొక్క ఎక్కువగా భారతదేశం మరియు తూర్పు ఆసియాలోని బంజరుభూముల్లో పెరుగుతుంది.
మొదట్లో కేవలం వినాయక చవితికి మాత్రమే ఈ మొక్కను వాడతారనే అపోహ మాకుండేది. ఈ మధ్యే ఆ అపోహ పటాపంచలైంది. ఈ మొక్క యొక్క ప్రతీ భాగంలో ఎన్నో ఔషదీయ గుణాలు దాగున్నాయనే విషయం తర్వాత తెలిసి ఆశ్చర్యము వేసింది. ఈ తుమ్మి మొక్క యొక్క ఉపయోగాలు క్రింది విధంగా ఉన్నాయి చూడండి.
 తుమ్మి మొక్క యొక్క ఆకులని ఆహారంగా వాడుతారు. చింతకాయలు లేదా పప్పుతో కలిపి వండుతారు.
 పాము లేదా తేలు కరిచినప్పుడు, కరిచిన చోట దీని యొక్క ఆకుల పసరును పూస్తారు. అంతేకాక, ఇతర కీటకాల కాటుకు కూడా పసరుని వాడతారు.
 దురద, వాపు, మానని గాయాలు వంటి వాటికి తుమ్మి ఆకుల యొక్క పసరు అద్భుతమైన ఔషధం.
 గజ్జి వంటి చర్మ వ్యాధులకు తుమ్మి ఆకుల పసరు చాలా బాగా పనిచేస్తుంది.
 మలబద్ధకాన్ని పోగొడుతుంది. మరియు కడుపులోని నులిపురుగులని చంపివేస్తుంది.
 జలుబు, పడిశం, ఆస్తమా, ఉబ్బసం, దురద మంటలు, జ్వరం, కామెర్లకు తుమ్మి యొక్క కషాయం మంచి మందుగా పనిచేస్తుంది.
 శరీర నొప్పులు, పక్షవాతం వంటి వ్యాధులకు తుమ్మి ఆకుల పసరును వాడతారు.
 జలుబు నుండి ఉపశమనానికి తుమ్మి పువ్వుల సిరప్ ని సేవిస్తారు.
ముగింపు :-
ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ తుమ్మి మొక్క ఎక్కువగా గ్రామాల్లో, గిరిజన, కొండ ప్రాంతాల్లో కనిపిస్తుంది. తుమ్మి మొక్క యొక్క ఉపయోగాలు వారికి తెలిసినంతగా మనకు తెలియదు. ఆయుర్వేదం ప్రకారం “ప్రకృతి” మనకు దేవుడిచ్చిన ఒక వరం. అందులోని ప్రతీ మొక్క, చివరకి మనము దేనికీ పనికిరాదని భావించే గరక గడ్డిలో కూడా ఔషద గుణాలు దాగి ఉన్నాయి.
ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం.

6 comments

 1. తుమ్మి పూలను శివుని పూజకు వాడుతారు. నిజంగా ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క.
  🌺🌺🌺🌺👃
  యం. ధరిత్రీ దేవి

  Liked by 1 person

  • వినాయక పూజకు మాత్రమే వాడతారనే విషయం మాత్రం తెలుసు. శివుని పూజకు వాడుతారని మీ ద్వారా తెలిసింది. ధన్యవాదాలు🙏

   Liked by 1 person

   • చిన్నప్పుడు, మా పల్లెటూరిలో కార్తీకమాసం వచ్చిందంటే చాలు, ఆడపిల్లలంతా సాయంత్రంపూట ఖాళీ కొబ్బరిచిప్పలు పట్టుకుని పరుగులు తీస్తూ ఊరిబయటికి వెళ్లేవారు. అక్కడ పొలం గట్లమీద విరగబూసిన తుమ్మిపూలతో అవి నింపుకుని మళ్ళీ పరిగెత్తుతూ శివాలయం చేరుకునేవాళ్ళు. అక్కడ శివలింగం మీద ఆ పూలు చల్లి పూజించడం ఆనవాయితీ. అది గుర్తొచ్చి రాయాలనిపించింది.
    🌺🌺🌺🌺🌺👃
    యం. ధరిత్రీ దేవి

    Liked by 2 people

   • మీరు ఈ విషయాలను నా బ్లాగు ద్వారా నాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీ కామెంట్ చదివిన తరువాత నాకు చాలా సంతోషం కలిగింది 🙏😊

    Like

 2. భగవంతుడు మన కిచ్చిన
  అగణిత తరు లతలు , మ్రొక్క , లన్ని వరములే ,
  దిగ విడిచి ప్రకృతి ఫలములు
  మగుడ నథోగతికి జేరె మనుజ మనుగడల్ .

  Liked by 1 person

  • పద్యం చాలా బాగుందండి వెంకటరాజా రావు గారు.💐
   నా బ్లాగుకు విచ్చేసినందుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.🙏🙏
   ఈ లాక్ డౌన్ కాలంలో నేను తెలుగు కవితా ప్రక్రియలను, చంధస్సు, పద్యాలు రాసే విధానం గూర్చి నేర్చుకుంటున్నాను‌. పర్యాయ పదాలు, తెలుగు నిఘంటువును వాడుతూ కొత్తపదాలను నేర్చుకుంటున్నాను. మీ అందరిలా నేను కూడా పద్యాలు కూడా రాయాలని నా అభిలాష.😊😊. అందుకే నేర్చుకుంటున్నాను.

   Like

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.